Top story: అమ్మ ఎందుకు ఇలా చేసింది….?
కన్నతల్లే.. ఇద్దరు పిల్లలను దారుణంగా చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ గాజులరామారంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

కన్నతల్లే.. ఇద్దరు పిల్లలను దారుణంగా చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ గాజులరామారంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇద్దరు పిల్లలను చంపి..సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చింది?
హైదరాబాద్ గాజులరామారంలో తల్లి తన కొడుకులకు మరణ శాసనం లిఖించింది. ఇద్దరు పిల్లలను కత్తితో కర్కశంగా నరికేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది.. హైదరాబాద్ గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో అపార్ట్‌మెంట్ పై నుంచి మహిళ దూకి బలవన్మరణం చెందింది. ఆరో ఫ్లోర్ నుంచి దూకడంతో తలకు తీవ్ర గాయమై స్పాట్‌లోనే చనిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆ మహిళను అపార్ట్‌మెంట్‌లోని సెకండ్ ఫ్లోర్‌లో ఉండే తేజస్విని రెడ్డిగా గుర్తించారు. ఫ్లాట్‌లో ఉన్నవారికి సమాచారం ఇద్దామని వెళ్లిన స్థానికులకు ఊహించని షాక్ ఎదురైంది. ఇళ్లంతా రక్తసిక్తమై ఉంది. లోపలికి వెళ్లి చూస్తే… తేజస్విని ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే పెద్ద కుమారుడు హర్షిత్ రెడ్డి మృతి చెందాడు. చిన్న కొడుకు ఆశిష్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
ఇక తేజస్విని రెడ్డి ఇంట్లో 6 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు పిల్లలను కొబ్బరిబోండాలు నరికే కత్తితో నరికి చంపినట్లు గుర్తించారు. కిచెన్‌లో ఒకరిని.. హాల్‌లో ఒకరిని నరికేసింది. ఆపై తాను ఆరో ఫ్లోర్‌కు చేరుకుని… దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో భర్త వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లో లేరు. ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న అతను డ్యూటీకి వెళ్లారు.
తేజస్విని రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి దంపతుల స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి. వీరికి ఇద్దరు పిల్లలు. ఏడేళ్ల హర్షిత్ రెడ్డి, ఐదేళ్ల ఆశిష్ రెడ్డి. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని గాజులరామారంకి షిఫ్ట్ అయ్యారు. పిల్లలు పుట్టే వరకు వీళ్ల కాపురం బాగానే ఉంది. రెండు మూడేళ్లుగా పిల్లలకు ఉన్న అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇద్దరు పిల్లలకు శ్వాసకోస సంబంధిత వ్యాధులు ఉన్నట్లు చెబుతున్నారు కుటుంబసభ్యులు. పిల్లలకు ప్రతీ మూడు, నాలుగు గంటలకు ముక్కులో డ్రాప్స్ వేస్తే కానీ.. శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీనికితోడు… తేజస్విని కూడా డిప్రెషన్‌లోకి వెళ్లింది.
పిల్లలు స్కూల్‌కి, భర్త డ్యూటీకి వెళ్తుండటం… ఇంట్లో తాను మాత్రమే ఒంటరిగా ఉంటూ.. కుటుంబ సమస్యల గురించి ఆలోచిస్తూ.. మానసిక ఒత్తిడికి లోనైందంటున్నారు: ఇక తేజస్విని రెడ్డి రాసిన సూసైడ్ నోట్‌లోనూ ఇదే విషయాలను ప్రస్తావించినట్లు చెబుతున్నారు పోలీసులు. నోట్‌లో ఉన్న అంశాల ఆధారంగా భర్త వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు కుటుంబసభ్యులను విచారించారు. తమ మధ్య ఎలాంటి కలహాలు లేవని.. తేజస్విని మానసిక ఒత్తిడితోనే ఇంతటి ఘాతుకానికి పాలుపడింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లులే పిల్లలను కడతేర్చుతున్న ఘటనలు ఇటీవల హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారం, భార్యాభర్త మధ్య విభేదాలు, వివాహేతర సంబంధం, ఆరోగ్య సమస్యలు.. ఇలా కారణాలు ఏవైనా పిల్లలు వాటికి సమిధలవుతున్నారు..