ఆర్సీబీ ఓటమికి కారణాలివే…!
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగులోంది. బయటి వేదికల్లో అదరగొడుతున్న ఆ జట్టు సొంతగడ్డపై మాత్రం చేతులెత్తేస్తోంది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగులోంది. బయటి వేదికల్లో అదరగొడుతున్న ఆ జట్టు సొంతగడ్డపై మాత్రం చేతులెత్తేస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో ఆ జట్టు వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 9 వికెట్లకు 95 పరుగులే చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో పలు తప్పిదాలు.. ఆర్‌సీబీ ఓటమిని శాసించాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం ఆర్‌సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. ఆర్‌సీబీ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. వర్షం కారణంగా పిచ్‌పై గంటల కొద్ది కవర్లు కప్పి ఉంచడంతో మాయిశ్చర్ ఏర్పడి వికెట్.. బౌలర్లకు అనుకూలంగా మారింది. దాంతో ఆర్‌సీబీ బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. చిన్నస్వామి స్టేడియంలో ఛేజింగ్ టీమ్స్‌కే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్‌లో ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ.. మూడింటిలోనూ టాస్ ఓడిపోయింది.
బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై ఆర్‌సీబీ బ్యాటర్లు తేలిపోయారు. పంజాబ్ బౌలర్ల ఎక్స్‌ట్రా బౌన్స్‌కు ఇబ్బంది పడ్డారు. వర్షాభావ పరిస్థితుల మధ్య డక్‌వర్త్ లూయిస్ లెక్కల ఒత్తిడి నేపథ్యంలో పరుగులు చేయాలనే ఆతృత కనబర్చి వికెట్లు పారేసుకున్నారు. అనవసర షాట్లతో మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వైఫల్యం ఆర్‌సీబీ పతనాన్ని శాసించింది.
కోహ్లీ తన శైలికి తగ్గట్లు నిదానంగా ఆడుతూ ఆఖరి వరకు క్రీజులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో అప్పటి వరకు స్వేచ్ఛగా ఆడిన రజత్ పటీదార్ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాల్సి వచ్చింది. చివర్లో టీమ్ డేవిడ్ మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీకి గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. అతనికి అండగా మిడిలార్డర్‌లో ఒక్క బ్యాటర్ రాణించినా.. ఆర్‌సీబీ మరో 20 పరుగులు అదనంగా చేసిది. అప్పుడు మ్యాచ్ మరింత రసవత్తరంగా మారేది.
మరోవైపు పంజాబ్ కింగ్స్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్ ఆర్‌సీబీ పతానాన్ని శాసించారు. కానీ ఆర్‌సీబీ స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఒకే ఒక్క ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా 10 పరుగులివ్వగా.. ఆరంభంలో పర్వాలేదనిపించిన సుయాశ్ శర్మ ఆ తర్వాత భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. చాహల్-హర్‌ప్రీత్ బ్రార్ తరహాలో ఈ ఇద్దరూ చెలరేగి ఉంటే 96 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఆర్‌సీబీ కాపాడుకునేది. జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ పోరాటానికి మిగిలిన బౌలర్ల సపోర్ట్ కూడా తోడై ఉంటే ఫలితం మరోలా ఉండేది.