అదే టర్నింగ్ పాయింట్, ముంబై ఓటమికి కారణం అతడే
ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమై ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయింది.. ఫేవరెట్ జట్లు తుస్సుమనిపిస్తున్నా... చిన్న జట్లు అదరగొడుతున్నా ఇంకా ఎక్కడో కొంచెం ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్..

ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమై ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయింది.. ఫేవరెట్ జట్లు తుస్సుమనిపిస్తున్నా… చిన్న జట్లు అదరగొడుతున్నా ఇంకా ఎక్కడో కొంచెం ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్.. అదే అసలైన ఐపీఎల్ మజా… కానీ ముంబై, ఆర్సీబీ మ్యాచ్ తో అభిమానులకు ఐపీఎల్ మజా దక్కింది. రెండు జట్లలో టీ ట్వంటీ స్టార్ ప్లేయర్స్ ఉండడంతో మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. మొదట బెంగళూరు భారీస్కోరుతో సవాల్ విసిరితే… తడబడి నిలబడిన ముంబై కూడా చివరి వరకూ పోరాడింది. చివర్లో వరుస వికెట్లు కోల్పోయి పరాజయం పాలైనప్పటకీ ఓవరాల్ గా మాత్రం ఈ మ్యాచ్ వాంఖేడే స్టేడియాన్ని ఊపేసింది. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే…దాదాపు ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి మ్యాచ్ ను గెలిపించినంత పనిచేశారు.
తమ తుఫాన్ ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అభిమానులను అలరించారు. క్రీజులో ఉన్నంతసేపూ బౌండరీల వర్షం కురిపించారు. సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత నుంచి మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆఖరి ఓవర్ వరకు హార్దిక్, తిలక్‌లో ఏ ఒక్కరూ నిల్చున్నా మ్యాచ్ ముంబై ఇండియన్స్‌దే. కానీ అంతటి విధ్వంసం సృష్టించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు వరుస ఓవర్లలో అవుటవడంతో మ్యాచ్ మలుపుతిరిగి ఆర్సీబీ వైపు వెళ్లింది.
సూర్యకుమార్ యాదవ్ అవుటవగానే నమన్ ధీర్‌ను పక్కనబెట్టి కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 13వ ఓవర్ మొత్తం తిలక్ వర్మనే స్ట్రయికింగ్‌లో ఉండి సుయాష్ వేసిన ఆ ఓవర్‌లో 17 పరుగులు రాబట్టాడు. హేజెల్‌వుడ్ వేసిన 14వ ఓవర్‌లో హార్దిక్ తాను ఎదుర్కున్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఆ ఓవర్‌లో వరుసగా ఒక సిక్సర్, మూడు ఫోర్లతో కలిపి 20 పరుగులు బాదాడు. ఇక 15వ ఓవర్ కృనాల్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది 8 బంతుల్లో 33 పరుగులు చేశాడు. మరోవైపు తిలక్ వర్మ కూడా భువి వేసిన 16వ ఓవర్‌లో వరుసగా బౌండరీలు కొట్టాడు.
ఆఖరి మూడు ఓవర్లలో 18 బంతుల్లో ముంబై విజయానికి 41 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చింది. క్రీజులో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉండడంతో మ్యాచ్ ముంబైదే అనుకున్నారంతా… కానీ 18వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. ఆ ఓవర్‌లో యార్కర్లతో ముంబై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన భుమి చాకచక్యంగా తిలక్ వర్మను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లో హేజెల్‌వుడ్ వేసిన మొదటి బంతినే సిక్సర్‌గా కొట్టే ప్రయత్నం హార్దిక్ పాండ్యా బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా-తిలక్ వర్మ కలిసి 34 బంతుల్లో ఏకంగా 89 పరుగులు రాబట్టారు. తిలక్ వర్మ 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 56, హార్దిక్ కేవలం 15 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. పటిదార్ అద్భుతమైన కెప్టెన్సీతో బౌలింగ్ చేయించాడు. 18వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్, 19వ ఓవర్ వేసిన జోష్ హేజెల్‌వుడ్ మ్యాచ్‌ని మలుపు తిప్పేయగా. ఆఖరి ఓవర్‌లో కృనాల్ పాండ్యాకి అదృష్టం కలిసి రావడంతో బెంగళూరుకి విజయం దక్కింది.