అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్.. ‘వీడేం హీరో నుంచి హీరో అంటే వీడేరా’ వరకు జర్నీ..!
లాగూలు వేసుకుని ఇండస్ట్రీకి వచ్చాడు.. అప్పట్లో వీడు కూడా హీరోనా.. డబ్బులు ఉంటే సరిపోతుందా టాలెంట్ అవసరం లేదా.. అనుకున్న వాళ్లు లేకపోలేదు.. ప్రేక్షకుల ముందుకు తోసేసి.. వాళ్లపైకి రుద్దేస్తారా..?

లాగూలు వేసుకుని ఇండస్ట్రీకి వచ్చాడు.. అప్పట్లో వీడు కూడా హీరోనా.. డబ్బులు ఉంటే సరిపోతుందా టాలెంట్ అవసరం లేదా.. అనుకున్న వాళ్లు లేకపోలేదు.. ప్రేక్షకుల ముందుకు తోసేసి.. వాళ్లపైకి రుద్దేస్తారా..? అంటూ అల్లు అర్జున్ మీద మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. బహుశా తెలుగులో ఏ వారసుడిపై కూడా ఈ స్థాయి విమర్శలు రాలేదు. కానీ బన్నీపై వచ్చాయి. గంగోత్రి విడుదల అయినపుడు చాలా మంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్ అంటున్నాయి. అతడే అల్లు అర్జున్.. వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈ హీరో పుట్టినరోజు ఎప్రిల్ 8. ఇండస్ట్రీలో ఈ మధ్యే 22 ఏళ్లు పూర్తి చేసుకున్న బన్నీ.. ఇప్పుడు జీవితంలో 42 వసంతాలు పూర్తి చేసుకుని 43వ ఒడిలోకి అడుగు పెడుతున్నాడు. ప్రస్తుతం ఈయన అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈయన మార్కెట్ ఇప్పుడు 1500 కోట్లకు పైనే ఉంది. అల వైకుంఠపురములో సినిమాతో 150 కోట్ల షేర్ అందుకుని సంచలనం రేపిన బన్నీ.. పుష్ప సినిమాతో ఆ రేంజ్ 1500 కోట్లకు పైగా చేర్చాడు.
అప్పట్లో ఈయనేం హీరో అన్నోళ్లే ఇప్పుడు ఈయనే హీరో అంటున్నారు. అలా మారిపోయాడు అల్లు వారబ్బాయి. తెలుగు ఇండస్ట్రీలో బన్నీ కంటే ఎక్కువ మేకోవర్ అయిన హీరో మరొకరు లేరంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఆర్య సినిమా తర్వాత విమర్శించిన వాళ్లే అబ్బో కుర్రాడిలో కసి ఉందిరా అంటూ పొగిడారు. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ గా అప్పట్లోనే చిరంజీవితో ప్రశంసలు అందుకున్నాడు బన్నీ. ఇక మూడో సినిమా బన్నీతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు అల్లు అర్జున్. తొలి మూడు సినిమాలతో వరస హిట్లు అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. వెంటనే హ్యాపీ నిరాశ పరిచినా.. దేశముదురుతో హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించాడు బన్నీ. ఆ మరుసటి ఏడాది పరుగుతో తన నటనను చూపించాడు. ఆర్య 2.. వరుడు.. వేదం.. బద్రీనాథ్ లాంటి సినిమాలు బన్నీ ఇమేజ్ ను దెబ్బతీసాయి. 2012లో జులాయి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అల్లుఅర్జున్. ఈ సినిమాతో తొలిసారి 40 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు.
జులాయి తర్వాత కూడా మళ్లీ ఫ్లాపులు అందుకున్న బన్నీ.. 2014 నుంచి స్టైల్ మార్చుకున్నాడు. రేసుగుర్రం నుంచి బన్నీకి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయిపోయింది. సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్ టాక్ తోనే 50 కోట్లు వసూలు చేసింది. ఇక రుద్రమదేవికి బన్నీనే ప్రాణం అయ్యాడు. సరైనోడు ఈ హీరో మాస్ పవర్ ఏంటో చూపించింది. డిజే కూడా నెగిటివ్ టాక్ తో ఓపెన్ అయి కూడా 70 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత అల వైకుంఠపురములో ఏకంగా దాన్ని డబుల్ చేసింది. పుష్ప వచ్చి మార్కెట్ పదింతలు పెంచింది. ప్రస్తుతం బన్నీకి 2000 కోట్లు టార్గెట్. ప్రస్తుతం అట్లీ సినిమాతో సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు బన్నీ. ఈ ప్రయాణంలో తెలుగు వాళ్ళతో పాటు మొత్తం ఆల్ ఇండియా ఆడియన్స్ మనసు దోచుకున్నాడు అల్లుఅర్జున్. ఈయన ప్రయాణం ఇలాగే సాగాలని కోరుకుంటూ మరోసారి బన్నీకి బర్త్ డే విషెస్ చెబుదాం..!