హోంగ్రౌండ్ లో షాక్ మీద షాక్, ఆర్సీబీ ఓటమికి కారణాలు ఇవే
ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సొంతగడ్డపై మాత్రం ఊహించని షాక్ తగులుతోంది. ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఆ జట్టు పరాజయం పాలైంది

ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సొంతగడ్డపై మాత్రం ఊహించని షాక్ తగులుతోంది. ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఆ జట్టు పరాజయం పాలైంది. అసలు పరుగుల వరదకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఇలా ఓడిపోవడం ఒక విధంగా ఫ్యాన్స్ కు షాకే.. ఎందుకంటే అద్భుతమైన ఆరంభం దక్కినప్పటకీ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమవడంతో ఢిల్లీ చేతిలో ఓటమి తప్పలేదు. ముఖ్యంగా టాస్ ఓడిపోవడం ఆర్‌సీబీకి నష్టం చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. బౌలింగ్ ఎంచుకుంది. మైదానం చిన్నది కావడం.. మంచు ప్రభావంవచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీ ఛేజింగ్‌కు మొగ్గు చూపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. పిచ్ కండిషన్స్‌ను అంచనా వేయడంలో విఫలమైంది. తమ దూకుడు అప్రోచ్‌ను కొనసాగించింది. కొత్త బంతితో పరుగులు వచ్చినా.. పవర్ ప్లే అనంతరం వికెట్ స్లోగా మారింది. బంతి ఆగుతూ రావడంతో.. పరుగులు చేసేందుకు బ్యాటర్లు తడబడ్డారు.
ఈ విషయాన్ని గ్రహించిన ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్.. కండిషన్స్‌కు తగ్గట్లు స్లోగా బ్యాటింగ్ చేసి చివర్లో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం అతనే ఈ విషయాన్ని వెల్లడించాడు. కీపింగ్ చేయడంతో పిచ్ కండిషన్స్ బాగా అర్థమయ్యాయని చెప్పాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ టాస్ ఓడి మూల్యం చెల్లించుకుంది. టాస్ గెలిస్తే ఆర్‌సీబీ కూడా బౌలింగ్ ఎంచుకునేది. అలాగే తొలి వికెట్ కు కేవలం 4 ఓవర్లలోనే 61 పరుగులు జోడించిన ఓపెనింగ్ జోడీలో సాల్ట్ రనౌట్ ఆర్బీబీ కొంపముంచింది. అనవసరంగా సింగిల్ కోసం ప్రయత్నించిన సాల్ట్ కోహ్లీతో సమన్వయం లోపించడంతో రనౌట్ గా వెనుదిరిగాడు. తొలి వికెట్ పడిన తర్వాత ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు తీసిన ఆర్సీబీని కట్టడి చేశారు. పైగా మిడిలార్డర్ వైఫల్యం ఆర్‌సీబీకి పెద్ద మైనస్ గా మారింది. ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించినా.. మిగతా బ్యాటర్లు ఆ జోరును కొనసాగించలేకపోయారు. రజత్ పటీదార్ మినహా దేవదత్ పడిక్కల్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా తీవ్రంగా నిరాశపర్చారు. టీమ్ డేవిడ్ చివర్లో మెరుపులు మెరిపించకుంటే మాత్రం ఆర్‌సీబీ ఇంకా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది.. అతనికి తోడుగా మిడిలార్డర్‌లో ఒక్క బ్యాటర్ చెలరేగినా.. ఆర్‌సీబీ కనీసం 200 రన్స్ చేసేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది.
ఇదిలా ఉంటే క్రికెట్ లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఎందుకంటారో మరోసారి రుజువైంది.
యశ్ దయాల్ వేసిన నాలుగో ఓవర్‌లో కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను ఎక్స్‌ట్రా కవర్స్‌లో రజత్ పటీదార్ నేలపాలు చేశాడు. అప్పటికి రాహుల్ చేసింది 5 పరుగులే. ఈ అవకాశంతో చెలరేగిన రాహుల్.. 93 పరుగులతో నాటౌట్ గా నిలిచి ఆర్‌సీబీని గట్టి దెబ్బే కొట్టాడు. ముఖ్యంగా 15వ ఓవర్‌లో హ్యాజిల్ వుడ్ ను ఎడాపెడా బాదేసి ఏకంగా 22 పరుగులు సాధించాడు. అప్పటి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ఈ ఒక్క ఓవర్‌తో ఢిల్లీ వైపు వెళ్ళిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే గేమ్ ఛేంజింగ్ మూమెంట్ ఈ ఓవరే. రజత్ పటీదార్ క్యాచ్ పట్టినా.. హజెల్ వుడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఆర్‌సీబీకి ఆశించిన ఫలితం దక్కేది.