ధోనీని కెప్టెన్ చేస్తే సరిపోద్దా ? చెన్నై రాత మారదన్న ఊతప్ప
ఐపీఎల్ 18వ సీజన్ లో హాట్ ఫేవరెట్ అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ విజయం కోసం కిందా మీదా పడుతోంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడి కేవలం ఒకే ఒక్క విజయం అందుకుంది.. మిగిలిన నాలుగింటిలోనూ చిత్తుగా ఓడింది.

ఐపీఎల్ 18వ సీజన్ లో హాట్ ఫేవరెట్ అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ విజయం కోసం కిందా మీదా పడుతోంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడి కేవలం ఒకే ఒక్క విజయం అందుకుంది.. మిగిలిన నాలుగింటిలోనూ చిత్తుగా ఓడింది. ముఖ్యంగా ఛేజింగ్ లో ఒకప్పుడు తిరుగులేని సీఎస్కే ఇప్పుడు చేతులెత్తేస్తోంది. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన నేపథ్యంలో ఇప్పుడు మహేంద్రసింగ్ ధోనీకి జట్టు పగ్గాలు అప్పగించారు. దీంతో ధోనీ కెప్టెన్ గా రీ ఎంట్రీ ఇవ్వడంతో చెన్నై మళ్ళీ విజయాల బాట పడుతుందంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ పలువురు మాజీ క్రికెటర్లు మాత్రం చెన్నై కెప్టెన్సీ మార్పు ఫలితాన్ని ఇవ్వదని, కొన్ని లోపాలు అధిగమించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఒకప్పటి సీఎస్‌కే స్టార్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై జట్టు రాత మారదని అభిప్రాయపడ్డాడు. జట్టులో ఎన్నో లోపాలు ఉన్నాయనీ , ముందుగా వాటిని సరిచేయాలన్నాడు. అంతేగానీ ధోనిని తిరిగి కెప్టెన్‌గా చేసినందు వల్ల పరిస్థితులు వాటికవే చక్కబడిపోవన్నాడు. రుతు లాంటి కీలక బ్యాటర్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది సీఎస్కే ఫ్రాంచైజీకి సవాల్ గా అభివర్ణించాడు.
డెవాన్ కాన్వే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రిటైర్డ్ అవుట్ కావడానికి ముందు 69 పరుగులు చేశాడనీ, ఇక రచిన్ ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడనీ గుర్తు చేశాడు. ఇలాంటి సమయంలో రుతు లాంటి సాలిడ్ బ్యాటర్ లేకుండా సీఎస్కే ఎలా ముందుకెళుతుందని ప్రశ్నించాడు.
రాహుల్ త్రిపాఠిని మూడో స్థానంలో బరిలోకి దించే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నాడు. ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్‌ను తుది జట్టులోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నాడు. ఈ సవాళ్లను ధోని ఎలా అధిగమిస్తాడో చూడాల్సి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై విజయాల బాట పడడం అంత ఈజీ కాదన్నాడు. కాగా గతేడాది సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న ధోని.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించాడు. అయితే, అతడి సారథ్యంలో చెన్నై గొప్పగా రాణించలేకపోతోంది. ఐపీఎల్-2024లో రుతు సేన పద్నాలుగు మ్యాచ్‌లకు ఏడు గెలిచింది. అయితే, ఆర్సీబీతో కీలక మ్యాచ్‌లో ఓడి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి బాటపట్టింది. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.