పాపం ఆర్సీబీ ఫ్యాన్స్ ,స్టేడియంలోనే కన్నీళ్ళు
ఐపీఎల్ లో ప్రతీ టీమ్ కు తమదైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. సాధారణంగా క్రికెట్ ను మతంలా ఆరాధించే మన దేశంలో ఐపీఎల్ లో జట్లకు

ఐపీఎల్ లో ప్రతీ టీమ్ కు తమదైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. సాధారణంగా క్రికెట్ ను మతంలా ఆరాధించే మన దేశంలో ఐపీఎల్ లో జట్లకు ఆయా సిటీల పరంగానే కాదు అందులో ఆడే స్టార్ ప్లేయర్స్ కు అనుగుణంగా విపరీతమైన క్రేజ్ ఉంటుందని ప్రచ్యేకంగా చెప్పక్కర్లేదు. మిగిలిన టీమ్స్ తో పోలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. 17 ఏళ్ళుగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవకున్నా ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గకపోగా… ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. దీనికి కారణం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీనే… అందుకే ఈ ఫ్రాంచైజీతో అభిమానులు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత ఎమోషనల్ అనేది మరోసారి రుజువైంది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఘోరపరాజయం చవిచూసిన వేళ స్టేడియంలో పలువురు అభిమానులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
పంజాబ్ తో మ్యాచ్‌లో అత్యల్ప స్కోరుకు ఆ జట్టు ఆలౌటయ్యేలా కనిపించింది. గతంలో 49 పరుగుల రికార్డును ఆర్సీబీ ఎక్కడి బ్రేక్ చేస్తుందోనని ఫ్యాన్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మ్యాచ్ చూశారు. మొత్తానికి టిమ్ డేవిడ్ దయవల్ల ఆ గండం నుంచి బయటపడేశాడు.14 ఓవర్ల మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మొదటి బంతినే బౌండరీగా మలచడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లారు. 14 ఓవర్లలో ఆర్సీబీ ఇక 200 కొట్టేస్తోంది అని ఫిక్స్ అయిపోయారు. తీరా సీన్ కట్ చేస్తే అతి కష్టం మీద 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. జట్టులోని 11 మంది బ్యాటర్లలో తొమ్మిది మంది సింగిల్ డిజిట్ స్కోర్స్ చేశారు. ఫిల్ సాల్ట్ 4 బంతుల్లో 4, విరాట్ కోహ్లి 3 బంతుల్లో 1, లియామ్ లివింగ్‌స్టన్ 6 బంతుల్లో 4, జితేశ్ శర్మ 7 బంతుల్లో 2, కృనాల్ పాండ్యా 2 బంతుల్లో 1, మనోజ్ 4 బంతుల్లో 1, భువనేశ్వర్ 13 బంతుల్లో 8, యశ్ దయాల్ డకౌట్, హేజెల్‌వుడ్ 1 బంతికి సున్నా పరుగులు చేశారు. కెప్టెన్ రజత్ పటిదార్ 18 బంతుల్లో 23, టిమ్ డేవిడ్ 26 బంతుల్లో 50 పరుగులు చేసి ఆర్సీబీ పరువు కాపాడారు.
అయితే ఆర్సీబీ వికెట్లు పడుతుంటే ఫ్యాన్స్‌కు కన్నీళ్లు వచ్చాయి. ఎక్కడ 49 పరుగుల్లోపు ఆలౌట్ అవుతారోనని ఆర్సీబీ డగౌట్స్‌తో పాటు స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా ఏడుపు మొహాలతో కూర్చున్నారు. లేడీ ఫ్యాన్స్ అయితే ఏడ్చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఐపీఎల్ ఫొటోగ్రాఫర్ ఆర్సీబీ లేడీస్ ఫొటోస్‌పై స్పెషల్ ఫోకస్ చేసి మరీ వాటిని అఫీషియల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇచ్చిన 96 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు 12.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఛేదించింది.