కింగ్ కోహ్లీ @ 13000 టీ20 క్రికెట్ లో నయా హిస్టరీ
ఐపీఎల్ 18వ సీజన్ లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఐపీఎల్ 18వ సీజన్ లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో చివరి రెండు బంతులను కోహ్లీ బౌండరీలు బాది 13వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ 381 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. విరాట్ కోహ్లీ 386వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డ్ అందుకున్నాడు.ఇదిలా ఉంటే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్ , కీరన్ పోలార్డ్ విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు.
కాగా ముంబైతో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులోకి వచ్చీరావడంతోనే కోహ్లీ బౌండరీలతో విరుచుకుపడటంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ఫస్ట్ గేర్ లో సాగింది. బుమ్రా బౌలింగ్‌లో ఓవర్ డీప్ మిడ్ వికెట్ దిశగా విరాట్ కోహ్లీ కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పడిక్కల్, కెప్టెన్ రజత్ పటిదార్ తో కలిసి కోహ్లీ పోటాపడి బౌండరీలు బాదేశాడు. పడిక్కల్ తో కలిసి రెండో వికెట్ కు 91 రన్స్ , పటిదార్ తో కలిసి మూడో వికెట్ కు 48 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో విరాట్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు.