చెన్నై వర్సెస్ ముంబై ఆ రెండూ తలపడితే యుద్ధమే
ఐపీఎల్ లో కొన్ని జట్ల మధ్య సమరం మామూలుగా ఉండదు... లీగ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ తలపడితే యుద్ధమే...

ఐపీఎల్ లో కొన్ని జట్ల మధ్య సమరం మామూలుగా ఉండదు… లీగ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ తలపడితే యుద్ధమే… ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా అభిమానులకు టీ ట్వంటీ పండుగే.. ఎందుకంటే ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్ కు కొదవ లేదు… ఆల్ రౌండర్లకు లోటు లేదు… మ్యాచ్ విన్నర్లకు కొరత లేదు.. అందుకే చివరి బంతి వరకూ మ్యాచ్ ఉత్కంఠతో ఊపేస్తుంటుంది. ఈ సారి కూడా సీజన్ రెండో రోజే చెన్నై, ముంబై తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఎప్పటిలానే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవరాల్ గా లీగ్ హిస్టరీలో ఈ రెండు జట్లే పది సార్లు ఛాంపియన్ గా నిలిచాయి. చెన్నై ఐదు, ముంబై ఐదు ట్రోఫీలతో సరిసమానంగా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో ముంబైదే పైచేయిగా ఉంది.
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి 2024 వరకూ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 37 మ్యాచ్‌లు ఆడాయి. అందులో ముంబై ఇండియన్స్ జట్టే ఎక్కువ విజయాలు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ 17 మ్యాచ్‌లలో విజయం సాధించగా, ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్‌లలో నెగ్గింది. ఐపీఎల్‌లోని మిగతా ఏ జట్టు కూడా ఈ రేంజ్‌లో చెన్నై మీద విజయాలు సాధించలేదు. ముంబై తర్వాత చెన్నైపై ఎక్కువ విజయాలు సాధించిన మరో రెండు జట్లు ఉన్నాయి. నూతనంగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా చెన్నైపై ఆధిపత్యం కొనసాగించాయి. చెన్నై – లక్నో మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగితే సీఎస్కే కేవలం ఒక్కటే గెలిచింది. అలాగే గుజరాత్ ,చెన్నై మధ్య ఏడు మ్యాచ్‌లు జరిగితే సీఎస్కే 3, గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌లలో విజయం సాధించాయి.
ఇదిలా ఉంటే చెన్నై, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ లకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతీసీజన్ లోనూ వీటి మధ్య పోరు రసవత్తరంగానే సాగి అభిమానులకు ఫుల్ కిక్కు ఇస్తుంటుంది. నువ్వా నేనా అన్నట్టు తలపడే ఈ మ్యాచ్‌లలో చెన్నైకి తిరుగులేని రికార్డు ఉంది. ఇరు జట్లు 33 మ్యాచ్‌లలో తలపడగా సీఎస్కే 21, ఆర్సీబీ కేవలం 11 మ్యాచ్‌లలోనే గెలిచింది. ఐపీఎల్ 2025లో కూడా ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. సీఎస్కే-ఢిల్లీ మధ్య 30 మ్యాచ్‌లు జరిగితే చెన్నై 19, కోల్‌కతాతో 29 మ్యాచ్‌లు ఆడి 19, పంజాబ్ కింగ్స్‌తో 29 మ్యాచ్‌లు ఆడి 16, రాజస్థాన్‌తో 29 మ్యాచ్‌లు ఆడి 16, సన్‌రైజర్స్‌తో 21 మ్యాచ్‌లు ఆడి 15 మ్యాచ్‌లలో గెలిచింది. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన విజయాలే ఎక్కువ. ఓవరాల్ గా చెన్నై జట్టు ముంబై, ఆర్సీబీలతో తలపడే మ్యాచ్ ల కోసమే అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.