కాషాయ పార్టీలోకి విజయిసాయిరెడ్డి, ముహూర్తం ఫిక్స్ చేసిన బీజేపీ హైకమాండ్
వైసీపీలో జగన్ తర్వాత ఓ వెలుగు వెలిగారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆ పార్టీ తరపున రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలకంగా వ్యవహరించారు.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి…రాజకీయ సన్యాసం అన్న మాటలు ఉత్తివేనా ? మళ్లీ రాజకీయంగా యాక్టివేట్ అవడం ఖాయమేనా ? అది కూడా జాతీయ పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా ? జూన్ లేదా జులై…కాషాయ కండువా కప్పుకోవడం గ్యారెంటీనా ? విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపేందుకు బీజేపీ అధిష్ఠానం అంగీకరించిందా ? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీలో జగన్ తర్వాత ఓ వెలుగు వెలిగారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆ పార్టీ తరపున రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ కుటుంబంతో మూడు తరాల బంధం ఉంది. వైసీపీకి ఆయన ఒక పిల్లర్ గా నిలబడ్డారు. అటువంటి సాయిరెడ్డి వైసీపీని వీడిపోతారు అని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం శాశ్వతం అనుకున్నారు.2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చే వరకు విజయసాయిరెడ్డి ఎదురే లేకుండా పోయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొంతకాలానికి…వైసీపీలో ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. వైసీపీలోని కీలక పదవుల నుంచి ఆయన్ను తప్పించారు. కొంతకాలం పాటు అవమానాలను భరించిన ఆయన…ఎట్టకేలకు వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే అదంతా అబద్దమేనని ఢిల్లీ రాజకీయవర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఇప్పుడు కొత్త పొలిటికల్ ఫ్లాట్‌ఫాం కోసం బీజేపీ ముఖ్యనేతలతో టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే…విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారనే టాక్స్ వినిపిస్తున్నాయి. జూన్ లేదా జూలై నెలలో…మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని ఆయన సన్నిహితులుతో పాటు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్కడ్ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు…అక్కడ విజయసాయిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. రాజకీయాల నుంచి విరమించుకుంటే బీజేపీకి చెందిన ముఖ్య నేతలు…దరాబాద్ కు ఎవరు వచ్చినా కలుస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి ఎందుకు వరుసగా బీజేపీ నేతలను కలుస్తున్నారన్న విషయం…ఆ పార్టీ నేతలకు కూడా మొదట్లో అర్థం కాలేదు. విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లానేంటో తెలిసిన తర్వాత అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన నెంబర్ 2గా ఉన్నారు. ఆ కేసులు ఇంకా ట్రయల్ కే రావడంలేదు. ఇప్పుడు అవి విచారణకు వస్తే ఆయనతో పాటు జగన్ కూడా జైలుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే.. బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ తరపున పెద్దల సభకు వెళ్లేందుకు…ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు కూటమి పార్టీలు అంగీకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. రాజీనామా చేసినప్పుడు చంద్రబాబుతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి… పవన్ మిత్రుడు అంటూ చెప్పుకున్న వైనాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
వైసీపీ నుంచి బయటకు రాగానే బీజేపీలో చేరితే…సాయిరెడ్డిపై అనేక అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ముందు రాజ్యసభ సభ్యత్వానికి…వైసీపీ రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరం అని ప్రకటించడానికి కూడా కారణం….విమర్శలు వస్తాయనే ఆలోచనతోనే అలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే కొన్ని నెలలు ఆగి తన భవిషత్తు ప్రణాళికపై క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారన్నది టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందన్న ప్రచారం ఉంది.