డబ్బులు ఊరికే రావు.. బడ్జెట్ ఎవడు భరిస్తాడు.. హీరోలకు నిర్మాతల షాక్..!

ఈ రోజుల్లో బడ్జెట్ అనేది మ్యాటర్ కాకుండా పోయింది. బాహుబలి లాంటి సినిమాలు 2000 కోట్లు వసూలు చేసిన తర్వాత.. నిర్మాతల్లో కూడా తెలియని ధైర్యం కనిపిస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2025 | 12:15 PMLast Updated on: Apr 17, 2025 | 12:15 PM

Money Doesnt Just Come Who Will Bear The Budget Producers Shock To Heroes

ఈ రోజుల్లో బడ్జెట్ అనేది మ్యాటర్ కాకుండా పోయింది. బాహుబలి లాంటి సినిమాలు 2000 కోట్లు వసూలు చేసిన తర్వాత.. నిర్మాతల్లో కూడా తెలియని ధైర్యం కనిపిస్తుంది. అయితే వందల కోట్లు వస్తున్నాయి కదా అని.. ముందు వెనక చూసుకోకుండా వందల కోట్లు పెట్టమంటే నిర్మాతలైనా ఎందుకు పెడతారు చెప్పండి..? అందుకే నిర్మాతలు కూడా ఈ మధ్య మొహమాటం తీసి పక్కనబెడుతున్నారు. స్టార్ హీరోలు సినిమాలకు అంటే మార్కెట్ ఉంటుంది.. థియెట్రికల్, నాన్ థియెట్రికల్‌లో ఎన్ని కోట్లు పెట్టినా రికవర్ అవుతున్నాయి కాబట్టి బడ్జెట్ పెట్టేస్తూ ఉంటారు నిర్మాతలు. కానీ ఇప్పుడా స్టార్ హీరోల సినిమాల విషయంలోనూ నిర్మాతలు కఠినంగానే ఉంటున్నారు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించేకంటే.. ఆ జాగ్రత్తలేవో కథ విన్నప్పుడే ఉంటే సమస్య ఉండదు కదా అంటున్నారు వాళ్లు. సినిమా లేట్ అయితే ఎక్కడ స్టార్ హీరో ఇచ్చిన డేట్స్ మిస్ అయిపోతాయో అని ఏదో ఒక కథకు ఓకే చెప్పేస్తూ ఉంటారు.

ఈ తరం నిర్మాతలు అలా కాదు.. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు. అక్కడ ఉన్నది స్టార్ హీరో అయినా.. మీడియం రేంజ్ హీరో అయినా.. ఎవరైనా కూడా తమకు వర్కౌట్ కాదంటే నిర్మొహమాటంగా సినిమాలను మొదట్లోనే ఆపేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అలా ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్‌లో రావాల్సిన గాంజా శంకర్ అందుకే ఆగిపోయింది. ఈ సినిమాను కేవలం బడ్జెట్ కారణంగానే ఆపేసింది సితార ఎంటర్టైన్మెంట్స్. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం దాదాపు 15 కోట్ల రెమ్యూనరేషన్ అడిగినట్టు ప్రచారం జరిగింది.. అలాగే ఫైనల్ బడ్జెట్ పేపర్ మీదే 80 కోట్ల వరకు పెరగడంతో.. నిర్మాతలు ముందుగానే జాగ్రత్త పడి ఆపేసారు. సంపత్ నంది కూడా ఈ సినిమా ఆగిపోవడం వెనక చాలా కారణాలున్నాయంటూ తాజా ఇంటర్వ్యూలలో చెప్తున్నాడు. గోపీచంద్ మలినేని, రవితేజ సినిమాకు కూడా జరిగింది.

3 హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ అయినా కూడా బడ్జెట్ వర్కవుట్ కాకపోవడంతో.. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతోనే ఆపేశారు మైత్రి మూవీ మేకర్స్. ఇదే సినిమాను సన్నీ డియోల్‌తో జాట్ అని తీసాడు గోపీచంద్. ఇది పర్లేదు బాగానే ఆడుతుందిప్పుడు. ఇక నాని, తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి కాంబినేషన్‌లో రావాల్సిన సినిమా కూడా పేపర్ మీదే 100 కోట్లు రావడంతో వర్కౌట్ అవ్వదని వెనక్కి తగ్గాడు నిర్మాత. కేవలం ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా సినిమాలు బయటికి రాకుండా ఆగిపోవడానికి కారణం బడ్జెట్ మాత్రమే. విజువల్ వండర్స్ అయితే ఎన్ని వందల కోట్లు పెట్టడానికైనా నిర్మాతలు రెడీగా ఉంటారు.. కానీ రొటీన్ కమర్షియల్ సినిమాల కోసం కూడా 60 నుంచి 100 కోట్లు పెట్టాలి అంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అందులోనూ మీడియం రేంజ్ హీరోలకు అస్సలే ఇప్పుడు టైమ్ బాగోలేదు. అందుకే నిర్మొహమాటంగా ఆ సినిమాలను ఆపేస్తున్నారు నిర్మాతలు. ఇది కూడా ఒకందుకు మంచిదే అంటున్నారు విశ్లేషకులు. దీని వల్ల దర్శకులు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని బడ్జెట్ లెక్కలు వేసుకుంటారు.