హరిహర వీరమల్లు అత్యంత చెత్త రికార్డు.. PK ఫ్యాన్స్ కు ఇంతకంటే అవమానం ఉంటుందా..?
ప్రభుత్వాలు మారిపోయాయి కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రం ముందుకు కదలడం లేదు. రాజకీయాల్లో ఆయన జీరోగా ఉన్నప్పుడు సినిమాల్లో హీరోగా వరుసగా సినిమాలు ఒప్పుకున్నాడు.

ప్రభుత్వాలు మారిపోయాయి కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రం ముందుకు కదలడం లేదు. రాజకీయాల్లో ఆయన జీరోగా ఉన్నప్పుడు సినిమాల్లో హీరోగా వరుసగా సినిమాలు ఒప్పుకున్నాడు. ఇప్పుడు పొలిటికల్ గా హీరో అయిపోవడంతో.. సినిమాలు చేయడానికి ఆయన దగ్గర టైం లేదు. అందులోనూ మరీ ముఖ్యంగా హరిహర వీరమల్లు ఏ సమయంలో మొదలు పెట్టాడో తెలియదు కానీ అది ఎంతకీ ముందుకు వెళ్లట్లేదు. తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. రికార్డు అంటే ఏదో పాజిటివ్ అనుకునేరు.. స్టార్ హీరోలలో ఎవరు కోరుకొని ఒక చెత్త రికార్డు పవన్ కళ్యాణ్ చెంత చేరింది. ఈయన ఉన్న బిజీకి పవన్ నుంచి సినిమాలు ఊహించడం కష్టమే అని తెలిసినా కూడా.. దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు కమిట్ అవుతూనే ఉన్నారు. ఒప్పుకునేటప్పుడు బాగానే ఓకే అన్నాడు కానీ ఆ తర్వాత మాత్రం ఆ ప్రాజెక్ట్స్ ముందుకు కదలడం లేదు. అప్పుడప్పుడో 2019లో హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా అత్యంత భారీగా ఈ సినిమా అనౌన్స్ అయింది. హరిహర వీరమల్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం దీని గురించి మాట్లాడుకుంది.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి పీరియాడికల్ సబ్జెక్ట్ కావడంతో కచ్చితంగా ఇది ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తుంది అని అందరూ నమ్మారు. దానికి తోడు దర్శకుడు క్రిష్ కావడంతో.. చాలా త్వరగానే సినిమా అయిపోతుంది అని అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు.. బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను హిస్టారికల్ సినిమాను కేవలం 79 రోజుల్లో పూర్తి చేశాడు క్రిష్. దాంతో పవన్ కళ్యాణ్ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే విడుదల చేస్తారని బలంగా నమ్మారు ఫ్యాన్స్. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టు హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే ఉన్నాయి. చివరికి విసుగు వచ్చి దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. బయటికి వెళ్లి ఆయన వేరే సినిమాలు చేసుకుంటున్నాడు. మరోవైపు ఒప్పుకున్న తప్పుకు తప్పుకోలేక నానా తిప్పలు పడుతున్నాడు నిర్మాత ఏఎం రత్నం. బయటి వాళ్లు సినిమా ఎవరూ టేకప్ చేయకపోవడంతో ఆయన కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో హరిహర వీరమల్లు సినిమా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. మే 9న ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ డేట్ కు కూడా సినిమా రావడం కష్టమే. దాంతో వాయిదాల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది వీరమల్లు. 2020 మార్చ్ లో సినిమాను విడుదల చేస్తామని ముందుగా అనౌన్స్ చేశారు దర్శకనిర్మాతలు. ఆ తర్వాత 2021 ఏప్రిల్ అన్నారు.. అది కాస్త సెప్టెంబర్ కు వెళ్ళింది.. కరోనా కారణంగా 2022 కనిపించకుండా పోయింది. 2023లో విడుదల చేస్తారేమో అనుకుంటే ఎన్నికల కారణంగా సినిమాను పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. దాంతో 2024 ఏప్రిల్ లేదా జూలై అన్నారు. కానీ పొలిటికల్ షెడ్యూల్ కారణంగా షూటింగ్ జరగకపోవడంతో మరోసారి వాయిదా తప్పలేదు. చివరికి అన్ని దాటుకుని 2025 మార్చి 28 న సినిమాను విడుదల చేస్తామని నమ్మకంగా చెప్పాడు ఏఎం రత్నం. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ డేట్ కూడా మిస్ అయిపోయింది.
మే 9 అని ప్రకటిస్తే.. ముందు నుంచి అభిమానులు పెద్దగా నమ్మలేదు. ఇప్పుడు వాళ్లు అనుకున్నట్టుగానే మరోసారి ఈ సినిమా వాయిదా పడేలా కనిపిస్తోంది. మే 30 లేదంటే జులైలో సినిమాను విడుదల చేస్తే ఆలోచన చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే దాదాపు 11 సార్లు వాయిదా పడింది హరిహర వీరమల్లు సినిమా. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నిసార్లు వాయిదా పడిన స్టార్ హీరో సినిమా ఇప్పటివరకు లేదు. ఈ విషయంలో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. చూస్తుంటే ఇది మిగిలిన సినిమాలకు సాధ్యమయ్యేలా కూడా కనిపించడం లేదు. కేవలం హరిహర వీరమల్లు మాత్రమే కాదు ఓజి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కాకపోతే డివివి ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ డేట్ విషయంలో కంగారు పడడం లేదు. షూటింగ్ అయిపోయిన తర్వాత డేట్ అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారు.