ఐపీఎల్ వాళ్ళకి హనీమూన్, ఆ ఇద్దరిపై సెహ్వాగ్ సెటైర్లు
ఐపీఎల్ ప్రతీ సీజన్ లో కొందరు విదేశీ ఆటగాళ్ళు ఫెయిలవడం కామన్... ప్రస్తుతం జరుగుతున్న 18వ సీజన్ లోనూ కోట్లు పెట్టి కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

ఐపీఎల్ ప్రతీ సీజన్ లో కొందరు విదేశీ ఆటగాళ్ళు ఫెయిలవడం కామన్… ప్రస్తుతం జరుగుతున్న 18వ సీజన్ లోనూ కోట్లు పెట్టి కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ జాబితాలో పంజాబ్ కు ఆడుతున్న గ్లెన్ మాక్స్ వెల్, ఆర్సీబీకి ఆడుతున్న లివింగ్ స్టోన్ కూడా ఉన్నారు. పలువురు విదేశీ ఆటగాళ్ళు బాగానే ఆడుతున్నా కొందరు మాత్రం నిరాశపరుస్తున్నారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
ఈ క్రమంలోకొంత మంది తమ సెలవులను ఆస్వాదించడానికే ఐపీఎల్ ఆడుతున్నారని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ ఆటగాళ్లు లియామ్ లివింగ్‌స్టోన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను ఉద్దేశించి సెహ్వాగ్ ఈ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లో మ్యాక్స్‌వెల్ , లివింగ్‌స్టోన్ ల ఆకలి తీరిపోయిందని తాను భావిస్తున్నానన్నాడు. వాళ్లు వస్తారు, ఆనందించి వెళ్లిపోతారనీ, జట్టు కోసం పోరాడాలనే కోరిక కనిపించడం లేదన్నాడు. తాను చాలా మంది మాజీ ఆటగాళ్లను స్వయంగా చూసానని, కానీ వారితో పోలిస్తే వీరిద్దరిలో జట్టు కోసం ఏదైనా చేయాలనే తపన కనిపించడం లేదని సెహ్వాగ్ విమర్శించాడు.
కాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ సీజన్ లోనూ ఫ్లాప్ అయ్యాడు. గత రెండు మూడు సీజన్లుగా నిరాశపరుస్తున్నప్పటకీ మెగా వేలంలో పంజాబ్ మాక్స్ వెల్ ను 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ తనమీద అంచనాలను అందుకోవడంలో మాక్స్ వెల్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో మ్యాక్సీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్ తో కూడా నిరాశపరిచాడు.6 మ్యాచ్‌ల్లో 8.20 సగటుతో 41 పరుగులు చేశాడు. ఈ సమయంలో మ్యాక్సీ స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే ఉంది. మరోవైపు, లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఆర్సీబీ తరపున బాగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో, అతను 1 అర్ధ సెంచరీ సహాయంతో 87 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్సీబీ లియామ్ లివింగ్‌స్టోన్‌పై 8.75 కోట్లు ఖర్చు చేసింది.