ముంబై ఇండియన్స్‌తో బిగ్ ఫైట్, సన్ రైజర్స్ తుది జట్టు ఇదే
ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలకపోరుకు రెడీ అయింది. వరుస ఓటముల తర్వాత హౌంగ్రౌండ్ లో పంజాబ్ పై విజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ ఇప్పుడు ముంబైతో తలపడబోతోంది.

ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలకపోరుకు రెడీ అయింది. వరుస ఓటముల తర్వాత హౌంగ్రౌండ్ లో పంజాబ్ పై విజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ ఇప్పుడు ముంబైతో తలపడబోతోంది. వాంఖేడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. హైస్కోరింగ్ గేమ్‌లో 245 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి విజయాన్నందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్ శర్మ.. విధ్వంసకర శతకంతో ఫామ్‌లోకి వచ్చాడు. ట్రావిస్ హెడ్ సైతం హాఫ్ సెంచరీతో టచ్ లోకి వచ్చేశాడు. పంజాబ్‌పై సాధించిన విజయం సన్‌రైజర్స్ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపింది.
అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి హైదరాబాద్ తుది జట్టులో పలు మార్పులు జరిగే అవకాశాలున్నాయి. స్పిన్నర్ ఆడమ్ జంపా గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమవ్వడంతో అతని స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్‌ను తీసుకుంది. పవర్ హిట్టర్ అయిన స్మరన్.. దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. జట్టులో ఫినిషర్ లోటు ఉండటంతోనే ఆరెంజ్ ఆర్మీ.. స్మరన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్మరన్‌కు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అభినవ్ మనోహర్ స్థానంలో స్మరన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
వాంఖడే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రాహుల్ చాహర్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అప్పుడు ఓ పేసర్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఇషాన్ మలింగా లేదా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న మహమ్మద్ షమీపై వేటు వేయవచ్చు. గత మ్యాచ్‌లో
పూర్తిగా తేలిపోయిన షమీ 4 ఓవర్లు వేసి 75 పరుగులిచ్చాడు. ఇషాన్ మలింగా, హర్షల్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేశారు. మిగతా లైనప్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జీషన్ అన్సారీ బరిలోకి దిగుతాడు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా రాహుల్ చాహర్ బరిలోకి దిగితే మాత్రం షమీ, ఇషాన్ మలింగాలో ఒకరు బెంచ్‌కు పరిమితమవుతారు.
మరోవైపు బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనున్నారు. గత మ్యాచ్ మాదిరి ఈ ఇద్దరూ చెలరేగితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగుండదు. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. అనికేత్ వర్మతో పాటు స్మరన్ రవిచంద్రన్ లోయరార్డ్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ సైతం వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో అద్భుత విజయాన్నందుకొని గాడిన పడింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్, ముంబై పోరు రసవత్తరంగా సాగనుంది. హోమ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుండటం ముంబై ఇండియన్స్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.