బీసీసీఐనా…మజాకా… హైబ్రిడ్ మోడల్ కు అన్ని జట్లు ఓకే
ప్రపంచ క్రికెట్ లో భారత్ సత్తా ఏంటో మరోసారి రుజువైంది. ఆటలోనే కాదు ఐసీసీని శాసించే విషయంలోనూ మనదే పైచేయి.. ఎందుకంటే బీసీసీఐ నుంచే ఐసీసీకి అత్యధిక ఆదాయం వస్తోంది. మన జట్టు ఎక్కడ ఆడినా ఆ దేశ క్రికెట్ బోర్డుతో పాటు ఐసీసీకి కూడా కాసుల వర్షమే..
ప్రపంచ క్రికెట్ లో భారత్ సత్తా ఏంటో మరోసారి రుజువైంది. ఆటలోనే కాదు ఐసీసీని శాసించే విషయంలోనూ మనదే పైచేయి.. ఎందుకంటే బీసీసీఐ నుంచే ఐసీసీకి అత్యధిక ఆదాయం వస్తోంది. మన జట్టు ఎక్కడ ఆడినా ఆ దేశ క్రికెట్ బోర్డుతో పాటు ఐసీసీకి కూడా కాసుల వర్షమే.. అందుకే భారత్ తో సిరీస్ ల కోసం ప్రతీ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటాయి. దీనికి తగ్గట్టే ఐసీసీలోనూ మన ఆధిపత్యం చాలా ఏళ్ళుగా కంటిన్యూ అవుతోంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ బీసీసీఐదే పైచేయిగా నిలిచింది. వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమివ్వబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ తప్ప అన్ని జట్లు అక్కడికి వెళ్ళేందుకు ఓకే చెప్పాయి. అయితే పాక్ తో మన ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో టీమిండియా అక్కడకి వెళ్ళడం లేదు. ఇదే విషయాన్ని ఐసీసీకి కూడా బీసీసీఐ తేల్చి చెప్పేసింది. పాక్ క్రికెట్ బోర్డు ఓ దశలో బెదిరిపులకు దిగినా బీసీసీఐ ముందు అవి చెల్లలేదు. చివరికి హైబ్రిడ్ మోడల్ లోనే టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ రెడీ అవుతోంది.
తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ విషయంలో ఐసీసీనే కాదు మిగిలిన దేశాల నుంచి కూడా పాకిస్థాన్ కు షాక్ తగిలింది. హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని టోర్నీలో ఆడే మిగిలిన జట్లు ఓకే చెప్పేశాయి. దీంతో తమ దేశంలోనే పూర్తిగా టోర్నీ నిర్వహించాలనుకున్న పాక్ క్రికెట్ బోర్డుకు దిమ్మతిరిగిపోయింది. బీసీసీఐ ఒక మాట చెబితే మిగిలిన దేశాలే కాదు ఐసీసీ సైతం వినాల్సిందే. ఐసీసీని శాసించే భారత దగ్గర ఓవరాక్షన్ చేసినందుకు ప్రస్తుత పరిస్థితి పాక్ క్రికెట్ బోర్డుకు పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే తమ మాట చెల్లదని తెలిసినా కూడా తోక జాడించేందుకు పాక్ క్రికెట్ బోర్డు పెద్దలతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు సైతం ఎక్స్ ట్రాలు మాట్లాడారు. భారత్ లేకుండానే టోర్నీ నిర్వహిస్తామంటూ హడావుడి చేశారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే విషయంలో బీసీసీఐ ఏమాత్రం రాజీ పడలేదు. అవసరమైతే టోర్నీ నుంచి కూడా తప్పుకునేందుకు భారత్ రెడీగా ఉందన్న వార్తలు కూడా వచ్చాయి.
కానీ ఐసీసీ మాత్రం పాక్ ప్రపోజల్స్ కు ఒప్పుకోలేదు. భారత్ లాంటి టాప్ టీమ్ లేకుండా ఇంత పెద్ద మెగా టోర్నీ నిర్వహిస్తే అది అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న విషయం ఐసీసీకి బాగా తెలుసు. అసలే టీ ట్వంటీ వరల్డ్ కప్ విషయంలో రెవెన్యూ పరంగా జరిగిన అవినీతితో నష్టపోయిన ఐసీసీ ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు. టీమిండియా ఆడకుంటే టోర్నీకి క్రేజ్ ఉండదని, అటు స్పాన్సర్లకూ, ఇటు బ్రాడ్ కాస్టర్లకు సైతం భారీ నష్టాలు తప్పవని గ్రహించి మేలుకుంది. హైబ్రిడ్ మోడల్ కు పాక్ బోర్డు ఒప్పుకోకుంటే అవసరమైతే ఛాంపియన్స్ ట్రోఫీని మరో దేశంలో నిర్వహించేందుకు కూడా ప్లాన్స్ రెడీ చేసింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డుకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకునేది లేదంటూ గత కొన్నిరోజులుగా నానా హడావుడి చేసిన పీసీబీ ఇప్పుడు అన్నీ మూసుకుని ఐసీసీ చెప్పినట్టే చేయాల్సి వస్తోంది. దీంతో భారత్ ఆడే మ్యాచ్ లు యూఏఈలో ఉంటాయని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ ఎపిసోడ్ తో వరల్డ్ క్రికెట్ లో బీసీసీఐ పవర్ ఏంటనేది మరోసారి అందరికీ తెలిసొచ్చింది.