మహేష్ బాబు మాస్టర్ ప్లాన్.. SSMB29 వచ్చే వరకు ఫ్యాన్స్ కు గ్యాప్ లేకుండా ఫుల్ మీల్స్..!

హీరోలు ఒకసారి రాజమౌళితో సినిమా కమిట్ అయిన తర్వాత అభిమానులు కూడా తమ హీరోను మరిచిపోతారు. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కలుసుకుందామంటూ లైట్ తీసుకుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 01:20 PMLast Updated on: Apr 16, 2025 | 1:20 PM

Mahesh Babus Master Plan Full Meals For Fans Without A Gap Until Ssmb29 Arrives

హీరోలు ఒకసారి రాజమౌళితో సినిమా కమిట్ అయిన తర్వాత అభిమానులు కూడా తమ హీరోను మరిచిపోతారు. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కలుసుకుందామంటూ లైట్ తీసుకుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. జక్కన్న సినిమా సెట్స్ మీదకు వచ్చిన తర్వాత బయట కనిపించడం చాలా వరకు తగ్గించాడు మహేష్. ఇంకా చెప్పాలంటే మిగిలిన రాజమౌళి హీరోలతో పోలిస్తే మహేష్ కాస్త బెటర్. ఈయన అప్పుడప్పుడైనా కెమెరా ముందు కనిపిస్తున్నాడు.. అదే ఎన్టీఆర్, రామ్ చరణ్ అయితే ఆర్ ఆర్ సినిమా జరిగినన్ని రోజులు ఎప్పుడో కానీ దర్శనం ఇవ్వలేదు. ఈ విషయంలో మహేష్ కాస్త అదృష్టం చేసుకున్నాడు అనుకోవాలి. గత 15 రోజులుగా ఇటలీలో ఉన్న మహేష్.. రెండు రోజుల కింద హైదరాబాద్ వచ్చాడు. SSMB29 కొత్త షెడ్యూల్ ఏప్రిల్ చివరి వారంలో మొదలు కానుంది. ఈ సినిమాను 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అంటే ఇప్పటినుంచి లెక్కలు వేసుకున్న మరో రెండు సంవత్సరాలు అన్నమాట. అన్ని రోజులు మహేష్ బాబు సినిమా కోసం వెయిట్ చేయడం తప్ప అభిమానులకు మరో ఆప్షన్ కూడా లేదు. అందుకే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు మేకర్స్.

ఈ మూడేళ్లు మహేష్ ను మిస్ అయిన ఫీల్ రాకుండా ఆయన పాత సినిమాలను వరుసగా రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే మొన్నటికి మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను మరోసారి థియేటర్లలోకి తీసుకొచ్చాడు దిల్ రాజు. ఇక ఏప్రిల్ 26న భరత్ అనే నేను సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్టు డివివి ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా 2018లో విడుదలై మంచి విజయం సాధించింది. భరత్ అనే నేను వచ్చిన నెల రోజుల తర్వాత.. అంటే మే 30న కృష్ణ జయంతి సందర్భంగా అతిథి సినిమాను 4k లో విడుదల చేస్తున్నారు. దీనికోసం ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా అతడు 4k రెడీ అవుతుంది. నిజానికి చాలా సంవత్సరాల నుంచి అతడు సినిమాను మళ్ళీ రిలీజ్ చేయాలి అని డిమాండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

2022లో మహేష్ పుట్టినరోజుకు పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసి ఈ ట్రెండుకు తెర తీశారు అభిమానులు. ఆ తర్వాత ఒక్కడు, బిజినెస్ మాన్, మురారి లాంటి సినిమాలు మళ్లీ విడుదలై మంచి వసూళ్ళు తీసుకొచ్చాయి. ఈసారి పుట్టినరోజుకు అతడు మళ్ళీ విడుదల కానుంది. అది వచ్చిన కొన్ని రోజుల గ్యాప్ లోనే ఖలేజా సినిమాను 4k లో విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత టక్కరి దొంగ కూడా లైన్ లో ఉంది. ఇలా రాబోయే రెండు మూడు సంవత్సరాలు మహేష్ పాత సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా తమ హీరోను మిస్ అయిన ఫీలింగ్ రాకుండా మేకర్స్ మహేష్ బాబు సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఇవన్నీ మళ్లీ విడుదల అయ్యేసరికి రెండేళ్లు ఇట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత SSMB29 షూటింగ్ చివరి దశకు వచ్చేసి ఉంటుంది. దాని టీజర్ ట్రైలర్ పోస్టర్స్ అంటూ మళ్ళీ అందులో మునిగిపోతారు మహేష్ అభిమానులు. అలా కళ్ళు మూసి తెరిచేలోపు మహేష్, రాజమౌళి సినిమా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఏదైనా మహేష్ అభిమానులు నెక్స్ట్ లెవెల్ అబ్బా.. రీ రిలీజ్ ట్రెండ్ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఇండియా వైడ్ గా దుమ్ము లేపుతుంది. ఇప్పుడు ఆయనకే బాగా కలిసి వస్తుంది ఈ ట్రెండ్.