కోహ్లీ వల్లే ఈ స్థాయిలో ఉన్నా ఆర్సీబీని వీడడంపై సిరాజ్ కామెంట్స్
ఐపీఎల్ 18వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లో ఈ సమ్మర్ టీ ట్వంటీ కార్నివాల్ షురూ కానుంది. ఈ సారి చాలా మంది ప్లేయర్స్ తమ పాత జట్ల వీడి కొత్త టీమ్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఐపీఎల్ 18వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లో ఈ సమ్మర్ టీ ట్వంటీ కార్నివాల్ షురూ కానుంది. ఈ సారి చాలా మంది ప్లేయర్స్ తమ పాత జట్ల వీడి కొత్త టీమ్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంతో అనుబంధం ఉన్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడబోతున్నాడు. మెగావేలానికి ముందే సిరాజ్ ను ఆర్సీబీ వదిలేసింది. గత ఏడు సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడిన సిరాజ్ కు మాజీ సారథి విరాట్ కోహ్లీతో మంచి అనుబంధం ఉంది. కోహ్లీ సూచనలతో అతను ఎన్నో వికెట్లు పడగొట్టాడు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం సిరాజ్ ను రిటైన్ చేసుకోలేదు. ఆర్టీఎం కార్డు ఉపయోగించి తిరిగి జట్టులోకి కూడా తీసుకోలేదు. వేలంలో గుజరాత్ సిరాజ్ ను 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆర్సీబీని వీడడంపై సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ జట్టును వీడటం కొంత భావోద్వేగానికి గురిచేసిందని అన్నాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్ లో కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. 2018-19లో తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కోహ్లీ చాలా మద్దతుగా నిలిచాడని సిరాజ్ గుర్తు చేసుకున్నాడు. అయితే, కొత్త సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్ లో చేరడం మంచి అనుభూతిగా ఉందన్నాడు. గిల్ సారథ్యంలో తమకు అద్భుతమైన జట్టు ఉందని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున సిరాజ్ 83 వికెట్లు పడగొట్టాడు. 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఒక సీజన్ ఆడి, ఆరు మ్యాచ్‌లలో 10 వికెట్లు తీసుకున్న సిరాజ్‌ను ఆర్సీబీ రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. 2018 నుంచి 2024 వరకు ఆర్సీబీకి ఆడిన సిరాజ్ 87 మ్యాచ్ ల్లో 83 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ తరపున సిరాజ్ నాలుగు సార్లు ప్లేఆఫ్స్‌లో ఆడినా ఎప్పుడూ ట్రోఫీ గెలవలేదు. 2023 అతని కెరీర్ లోనే బెస్ట్ సీజన్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సీజన్ లో 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసుకున్నాడు. ఇక గత సీజన్ లో సిరాజ్ 14 మ్యాచ్‌లలో 33.07 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే బీసీసీఐ ఐపీఎల్ లో సలైవా రూల్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సిరాజ్ స్వాగతించాడు. బౌలర్లకు ఇదో అద్భుత వార్తగా చెప్పాడు. బంతిపై ఉమ్మి రాయడం వల్ల రివర్స్ స్వింగ్‌ని రాబట్టే అవకాశాలు పెరుగుతాయన్నాడు.. బంతిపై పేసర్లకు పట్టు దొరుకుతుందంటూ వ్యాఖ్యానించాడు.
కాగా గతేడాది ఐపీఎల్ తో పాటు ఆ తర్వాత టీమిండియా తరపునా సిరాజ్ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిరాజ్ ను భారత జట్టుకు ఎంపిక చేయలేదు. చివరగా విదర్భతో రంజీ మ్యాచ్ ఆడిన అతను రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. జూన్ లో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఉన్న నేపథ్యంలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఐపీఎల్ సిరాజ్ కు కీలకంగా చెప్పాలి. గుజరాత్ తరపున నిలకడగా రాణిస్తే ఇంగ్లాండ్ టూర్ తో మళ్ళీ జట్టులోకి తిరిగి వచ్చే ఛాన్సుంది.