పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మీట్.. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ క్లియర్ అయిపోయినట్టేనా..?
అల్లు అర్జున్ కు, మెగా ఫ్యాన్స్ కు మధ్య కొన్ని నెలలుగా పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎవరికి వారు తగ్గకుండా తమ సత్తా చూపించాలని ప్రయత్నిస్తున్నారు.

అల్లు అర్జున్ కు, మెగా ఫ్యాన్స్ కు మధ్య కొన్ని నెలలుగా పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎవరికి వారు తగ్గకుండా తమ సత్తా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ బిహేవియర్ లో చాలా చేంజెస్ వచ్చాయి అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మెగా అభిమానులు లేకపోతే బన్నీ ఎక్కడినుంచి స్టార్ట్ అవుతాడు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అల వైకుంఠపురంలో ముందు వరకు తన ఫేవరెట్ హీరో చిరంజీవి.. రియల్ హీరో పవన్ కళ్యాణ్ అంటే చెప్పిన బన్నీ.. ఆ తర్వాత మాట మార్చి తను సొంతంగా ఎదగడానికి ట్రై చేశాను అని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందరికీ అభిమానులు ఉంటే తనకు మాత్రం ఆర్మీ ఉంది అంటూ చాలాసార్లు చెప్పాడు బన్నీ. ఈ మాటలే మెగా ఫాన్స్ కు అతనిని దూరం చేశాయి. ఇదిలా ఉంటే.. మెగా, అల్లు కుటుంబాల మధ్య రోజురోజుకు దూరం పెరిగిపోతుందనీ అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా అప్పుడప్పుడు ఈ రెండు కుటుంబాలు కలిసి ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం ఇద్దరి అభిమానులను సంతోషపరిచింది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత బన్నీ ఆయన ఇంటికి వెళ్లడం ఈ మధ్య కాలంలో ఇది రెండోసారి. డిసెంబర్లో పుష్ప సినిమా ప్రీమియర్ రోజు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. దాంతో అప్పట్లో ఈ కేసు అల్లు అర్జున్ ను బాగా ఇబ్బంది పెట్టింది. ఒకరోజు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు బన్నీ. అప్పుడు అతనిని బయటికి తీసుకురావడానికి మెగా కుటుంబం బాగా కష్టపడింది. ఆ సమయంలోనే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు అల్లు అర్జున్. తాజాగా పవన్ కళ్యాణ్ ఇంట్లో కష్టం వచ్చింది. ఈ మధ్య సింగపూర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. మూడు రోజులు హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఈ మధ్య డిశ్చార్జ్ అయ్యాడు.
ఆ తర్వాత సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన సిటీకి వచ్చిన తర్వాత చాలామంది ప్రముఖులు వెళ్లి పవన్ కళ్యాణ్ ను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్ బాలుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. చాలాసేపు పవన్ ఇంట్లోనే ఉండి కష్టసుఖాలు మాట్లాడుకున్నారు. ఈ మీటింగ్ తో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఉన్న దూరం కాస్తయినా తగ్గుతుంది అంటున్నారు విశ్లేషకులు. కష్టం వచ్చినప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు.. కానీ వాళ్ళను అభిమానించే ఫాన్స్ మాత్రం కొట్టుకొని చేస్తారనే విషయం మరొకసారి ప్రూవ్ అయింది.