ఇళయరాజా గారు.. 80 ఏళ్ల వయసులో ఇలాంటి ‘అగ్లీ’ పనులు అవసరమా మీకు..?

ఇళయరాజా.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు ఇది. సంగీత సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాజు ఈయన. 1000 సినిమాలకు పైగా సంగీతం అందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కాదు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2025 | 06:30 PMLast Updated on: Apr 15, 2025 | 6:30 PM

Cini Industry Serious On Ilyaraja

ఇళయరాజా.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు ఇది. సంగీత సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాజు ఈయన. 1000 సినిమాలకు పైగా సంగీతం అందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కాదు.. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక గ్రంథాన్ని రాసుకున్నాడు రాజా. ఇళయరాజా పాటలను ఇష్టపడని సంగీత ప్రియుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఎంత సాధిస్తే మాత్రం ఏం లాభం.. ఈయన చేసే కొన్ని పనులు చూస్తుంటే ఆయన మీద ఉన్న గౌరవ మెల్లమెల్లగా తగ్గిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. అంత తప్పు ఇళయరాజా ఏం చేశాడు అనుకోవచ్చు.. 80 ఏళ్ల వయసులో ఎంత మెచ్యూరిటీ ఉండాలి.. ఎవరైనా ఏదైనా చేస్తే సర్దుకుపోవాలి.. అంతేకానీ సాగదీసి దాన్ని పెంట చేయకూడదు అంటున్నారు. మామూలుగా తన పాటలను ఎవరైనా వాడుకుంటే ఇళయరాజా అసలు ఒప్పుకోడు. ఒక సినిమా పాట ట్యూన్ చేసినప్పుడు ఆడియో రైట్స్ కొనుక్కున్న ఆ కంపెనీకి సగం హక్కులే ఉంటాయి.. మిగిలిన సగం హక్కులు ఆ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరే ఉంటాయి. అయితే నిర్మాతలు ఒకసారి రైట్స్ అమ్మిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ అది తమ పాట అని ఫీల్ అవ్వరు. ఏదైనా సినిమాలో ఆ ట్యూన్ వాడుకోవాల్సి వస్తే కేవలం ఆ నిర్మాతలను, ఆడియో కంపెనీని అడిగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇళయరాజా మాత్రం అలా కాదు.

తన పాట తనకు మాత్రమే సొంతం అనుకుంటాడు. అది తను తప్ప ఇంకెవరు వాడుకోకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఈ లెజెండరీ సంగీత దర్శకుడు. బయట సినిమాలో తన పాట వినిపించింది అంటే చాలు ఆ నిర్మాతలకు కోటి నుంచి నోటీసులు వెళ్లాల్సిందే. అక్కడ వాడుకున్నది తన సొంత కొడుకు అయినా కూడా వదిలిపెట్టడు ఇళయరాజా. అప్పట్లో యువన్ శంకర్ రాజా ఒక సినిమాలో తన తండ్రి పాట వాడుకుంటే.. దానికి కూడా పెనాల్టీ వేశాడు ఇళయరాజా. అనుమతి లేకుండా తన పాటలను వాడుకుంటే వెంటనే లీగల్ నోటీసులు పంపిస్తాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. గతంలో చాలామంది దర్శక నిర్మాతలకు ఇది అనుభవం అయింది. అయినా కూడా ఎందుకో తెలియదు మరి ఇళయరాజా పాటలులను తమ సినిమాలలో వాడుకుంటూ ఉంటారు. పట్టించుకోడు అని ధైర్యమో.. లేదంటే ఏమైనా అయితే తర్వాత చూసుకుందాంలే అని తెగింపో తెలియదు కానీ ప్రతిసారి ఇళయరాజా పాటలు తమ సినిమాలలో వాడి అనవసరంగా బుక్ అవుతున్నారు దర్శకనిర్మాతలు.

తాజాగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు ఇదే పరిస్థితి వచ్చింది. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల వరకు వసూలు చేసింది. సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందించాడు. ఇందులో సందర్భానుసారంగా ఇళయరాజా గతంలో కంపోజ్ చేసిన 3 పాటలను వాడుకున్నారు దర్శక నిర్మాతలు. దాంతో వెంటనే అలర్ట్ అయ్యాడు మాస్ట్రో. అనుమతి తీసుకోకుండా తన పాటలను సినిమాలో వాడుకున్నందుకు తనకు మూడు కోట్ల పెనాల్టీ కట్టాల్సిందే అంటూ మైత్రి మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసులు పంపించాడు ఇళయరాజా. ఈయన ఇలా లీగల్ నోటీసులు పంపించడం ఇది మొదటిసారి కాదు.. ఆ మధ్య మంజుమల్ బాయ్స్ సినిమాలో తన పర్మిషన్ లేకుండా గుణ సినిమా పాట వాడుకున్నారు అంటూ ఐదు కోట్లు కావాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. ఆ సినిమా కథ మొత్తం ఆ పాట చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఇళయరాజాను కలిసి ఏదో సెటిల్ చేసుకున్నారు మేకర్స్. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కూడా మూడు రాజా గారి పాటలు ఉండడంతో ఆయన అసలు తగ్గేలా కనిపించడం లేదు.

తనకు 5 కోట్ల పెనాల్టీ ఇవ్వాల్సిందే అంటూ లీగల్ నోటీసులు పంపించాడు. అప్పట్లో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అనుమతి లేకుండా ఒక కాన్సర్ట్ లో తన పాటలు పాడినందుకు.. ప్రాణ మిత్రుడు అని కూడా చూడకుండా ఆయనకు లీగల్ నోటీసు పంపించాడు ఇళయరాజా. అప్పట్లో ఈ విషయంపై చాలా మదన పడ్డాడు బాలు. పెనాల్టీ కంటే కూడా తన ప్రాణ మిత్రుడే ఇలా అర్థం చేసుకోకుండా లీగల్ నోటీసులు పంపించడం ఏంటి అంటూ కన్నీరు పెట్టుకున్నంత పని చేశాడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అన్ని విషయాల్లో అద్భుతం అయినా కూడా.. ఈ పెనాల్టీల విషయంలో మాత్రం ఇళయరాజా తన ధోరణి మార్చుకుంటే బాగుంటుంది అంటున్నారు చాలామంది. మరి 80 సంవత్సరాల వయసులో ఈ అలవాటు ఆయన మార్చుకుంటాడా లేదా అనేది చూడాలి.