Top story: హలీవుడ్‌ను కాల్చేస్తున్న కార్చిచ్చు…!

ప్రపంచాన్ని అమెరికా భయపెడుతుంటే ఇప్పుడు ఆ దేశాన్ని కార్చిచ్చు కలవరపెడుతోంది. సినీతారల విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతైపోతున్నాయి. వందల కోట్లు పెట్టి కట్టుకున్న కలల సౌధాలు కాలి బూడిదైపోతున్నాయి. కార్చిచ్చు దెబ్బకు లాస్ఏంజెల్స్ అల్లాడిపోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2025 | 03:11 PMLast Updated on: Jan 10, 2025 | 3:11 PM

Top Story The Fire That Is Burning Hollywood

ప్రపంచాన్ని అమెరికా భయపెడుతుంటే ఇప్పుడు ఆ దేశాన్ని కార్చిచ్చు కలవరపెడుతోంది. సినీతారల విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతైపోతున్నాయి. వందల కోట్లు పెట్టి కట్టుకున్న కలల సౌధాలు కాలి బూడిదైపోతున్నాయి. కార్చిచ్చు దెబ్బకు లాస్ఏంజెల్స్ అల్లాడిపోతోంది.

మోంటాగ్, రీస్ విథర్సూన్, టామ్ హాంక్స్ వీళ్లంతా హాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్… కానీ ఇప్పుడు వీళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సొంత ఇళ్ల వదిలి భయంతో పరుగులు తీశారు. వందల కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్లన్నీ కళ్లముందే అగ్నికి ఆహుతవుతుంటే వేరేచోట ఎక్కడో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. వీళ్లే కాదు చాలామంది హాలీవుడ్ ప్రముఖులది ఇదే పరిస్థితి. రియాల్టీ స్టార్ పారిస్ హిల్టన్ ఇల్లు కూడా నామరూపాలు లేకుండా పోయింది. అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా అగ్నికి ఆహుతైంది. ఒక్కొక్కరు కొన్ని ఎకరాల్లో అత్యంత విశాలమైన, లగ్జరీ ఇళ్లు కట్టుకున్నారు. కానీ మంటలకు ఆ ఇల్లు ఈ ఇల్లు అని లేదు కదా… ఏది కనబడితే దాన్ని కబళిస్తూ వేగంగా వ్యాపిస్తున్నాయి.

లాస్ఏంజెల్స్ అంటేనే కోటీశ్వరుల కేరాఫ్. ఇక్కడ ఉండేదంతా సెలబ్రిటీలే… కోటికో రెండు కోట్లకో ఇళ్లు రావు… వందల కోట్లు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కోటి ఒక్కో విలాససౌధం… ఇక్కడ ఉండటం ఓ ప్రెస్టేజ్ ఇష్యూ… అలాంటి లాస్ఏంజెల్స్‌లో కొన్ని రోజుల క్రితం మొదలైన కార్చిచ్చు… ఇప్పుడు హాలీవుడ్ హిల్స్‌ను కమ్మేసింది. ఐకానిక్ నిర్మాణాలను కూడా చుట్టుముడుతోంది. ఆస్కార్ అవార్డులు ప్రధానం చేసే డాల్బీ థియేటర్ కూడా మంటల ముప్పులో చిక్కుకుంది. హాలీవుడ్ థీమ్ పార్క్, సిటీవాక్‌ను మూసివేసినట్లు యూనివర్శల్ స్టూడియో ప్రకటించింది. ముందుగా ఇన్‌లాండ్ హిల్స్ ప్రాంతంలోని అడవిలో మంటలు రేగాయి. చాలారోజులుగా వర్షాలు లేకపోవడంతో గడ్డి, చెట్లు ఎండిపోయాయి. దీంతో మంటలు గంటల వ్యవధిలోనే కొన్ని వేల ఎకరాలను చుట్టుముట్టాయి. దీనికి వేగంగా వీచే గాలులు తోడయ్యాయి. గంటకు దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటే ఇక మంటలను అదుపు చేయడం ఎలా సాధ్యమవుతుంది…

కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండటంతో చుట్టుపక్కల నిర్మాణాలను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు లక్షమందిని ఇప్పటికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒకచోట కాదు రెండు చోట్ల కాదు ఆరుచోట్ల మంటలు మొదలయ్యాయి. దీంతో వాటిని అదుపు చేయడం అధికారులకు తలకుమించిన పనవుతోంది. ఇప్పటికే 2వేలకు పైగా ఇళ్లు కాలి బూడిదయ్యాయి. సుమారు 5లక్షల కోట్ల రూపాయల సంపద కాలిబూడిదైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. హాలీవుడ్ ప్రముఖులు వందలు, వేల కోట్లు ఖర్చు చేసి సేకరించిన విలువైన కళాఖండాలు కూడా అగ్నిదేవుడి ఆకలికి బలైపోయాయి. మంటల కారణంగా ఇప్పటికి ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు.

ఆరుచోట్ల మంటలు రేగినా ప్రధానమైన వాటిని మాత్రం అదుపుచేయలేకపోతున్నారు. పాలిసాడ్స్ ఫైర్ ఏకంగా 16వేల ఎకరాలను కాల్చిపారేసింది. ఇక ఈటన్ ఫైర్ 10వేల ఎకరాలను మింగేసింది. హాలీవుడ్ హిల్స్‌ను చుట్టుముట్టిన సన్‌సెట్ ఫైర్ ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారింది. పాలిసాడ్స్ ఫైర్, ఈటన్ ఫైర్‌ను కనీసం ఒక్కశాతం కూడా కంట్రోల్ చేయలేకపోయారంటే సిట్యుయేషన్ అర్థం చేసుకోవచ్చు.

5వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరో 8వేల మందిని సిద్ధంగా ఉంచారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా సహాయ బృందాలను పిలిపిస్తున్నారు. విమానాలు, నేవీ హెలికాఫ్టర్ల ద్వారా మంటల నియంత్రణకు కెమికల్స్ వెదజల్లుతున్నారు. ఒకచోట మంటలు అదుపులోకి వస్తాయనుకుంటే మరోచోట మొదలవుతున్నాయి.

కార్చిచ్చుపై రాజకీయాలు మొదలయ్యాయి. లాస్ఏంజెల్స్‌లో కార్చిచ్చును అదుపు చేయలేకపోయిన గవర్నర్ గవిన్ న్యూసమ్ రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. మరోవైపు అధ్యక్షుడిగా ఇటలీలో చివరి పర్యటన చేయాల్సిన బైడెన్ దాన్ని రద్దు చేసుకున్నారు. లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. డిజాస్టర్ డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేశారు.

అమెరికా అంటే అగ్రరాజ్యం…. అంతా పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది అనుకుంటే అది తప్పే.. అమెరికాలోనూ అధికారుల నిర్లక్ష్యం తక్కువేమీ ఉండదు. కాలిఫోర్నియాలో కార్చిచ్చు చాలా కామన్. పొడి వాతావరణం కారణంగా వేసవిలో ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వేగంగా వీచే గాలులు మంటలు వేగంగా వ్యాపించేందుకు కారణమవుతాయి. ఈ రాష్ట్రంలో ఏటా కొన్నివేల ఎకరాలు మంటలకు ఆహుతి అవ్వాల్సిందే. ఎక్కడో చోట మంటలు రేగుతూనే ఉంటాయి. అయితే ఇలా రగిలే కార్చిచ్చుల్లో 85శాతం మానవ నిర్లక్ష్యం కారణంగానే అన్నది అంచనా. ఎవడో సిగరెట్ తాగి పడేస్తాడు. అది కొన్ని వందల ఎకరాలు మింగేస్తుంది. ఇంకెవడో క్యాంఫ్ ఫైర్ వేసి వదిలేస్తాడు. అది వేల ఎకరాలను కబళిస్తుంది. ఇక మంటలను అదుపు చేయడానికి వాడే ఎక్విప్‌మెంట్ నిర్వహణ కూడా అంతంతమాత్రమే. ఇంత జరుగుతున్నా కాలిఫోర్నియా అధికారులు మంటలను కంట్రోల్ చేసే ముందస్తు జాగ్రత్తలు అసలు తీసుకోరని ఆడిట్ నివేదికలు తేల్చిచెప్పాయి.