ఓదెల 2 రివ్యూ.. అఖండ అవుతుందేమో అనుకుంటే ఆగం ఆగం అయిపోయింది శివా..!

మూడేళ్ల కింద కరోనా టైంలో ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమా ఆహాలో విడుదలైంది. అప్పుడు ఆ సినిమా గురించి చర్చ బాగానే జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2025 | 04:16 PMLast Updated on: Apr 17, 2025 | 4:16 PM

Odela 2 Review

మూడేళ్ల కింద కరోనా టైంలో ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమా ఆహాలో విడుదలైంది. అప్పుడు ఆ సినిమా గురించి చర్చ బాగానే జరిగింది. సంపత్ నంది కథ అందించిన ఈ సినిమా డిజిటల్ వరకు పర్లేదు అనిపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ఓదెల 2 వచ్చింది. తమన్నా కూడా యాడ్ కావడంతో స్టార్ వాల్యూ మరింత పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ విషయానికి వస్తే.. ఫస్ట్ పార్ట్ లో వశిష్ట సింహ శోభనం రోజు పెళ్లికూతురులను రేప్ చేసి చంపేస్తూ ఉంటాడు. ఓదెల రైల్వే స్టేషన్ చూసిన వాళ్లకు ఇది క్లారిటీ ఉంటుంది. సీక్వెల్ ఆయన శవంతో మొదలవుతుంది. మనోడి బాడికి హాస్పిటల్లో పోస్టుమార్టం చేసి ఊరికి తీసుకొస్తారు. అయితే వశిష్ట చేసిన దారుణాలు తలుచుకున్న ఊరు జనం.. ఆయన ఆత్మకు శాంతి ఉండకూడదని సమాధి శిక్ష విధిస్తారు. అంటే శవాన్ని నిట్ట నిలువుగా పాతి ఆత్మకు శాంతి లేకుండా నల్ల కోడి రక్తం, నల్ల నువ్వులతో పూడుస్తారు. దాంతో వశిష్ట ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఊరు జనం మీద పగ తీర్చుకోవాలని.. ప్రేతాత్మగా మారి మళ్ళీ వస్తాడు. అతడి నుంచి కాపాడుకోవాలని ఊరు జనం మొత్తం నాగ సాధువు అయిన తమన్నా దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది.. పరమాత్మకు, ప్రయత్నాత్మకు జరిగిన పోరు ఎలా ఉంది అనేది మిగిలిన కథ..

స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. అనగనగా ఒక ఊరు.. ఆ ఊరిలో ఒక దుష్టశక్తి.. దాన్ని అంతమందించడానికి వచ్చే ఒక దైవ శక్తి.. ఎన్నో తెలుగు సినిమాల్లో చూసిన టెంప్లేట్ కథ ఇది. ఓదెల సీక్వెల్ కోసం మరోసారి అలాంటి కథను రాసుకున్నాడు సంపత్ నంది. మామూలుగా అయితే ఇలాంటి సినిమాల్లో ఇంతకంటే కథ చెప్పడానికి మరొకటి ఉండదు. కానీ ఎంత మంచి కథనంతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాం అనేది ముఖ్యం. అమ్మోరు, అరుంధతి నుంచి ఎన్నో సినిమాల్లో ఇలాంటి కథ మనం చూసాము. కానీ అందులో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలుగా అవి మిగిలిపోయాయి. కానీ ఓదెల 2లో అలాంటి అంశాలు ఏ కోశానా కనిపించవు. ఏదో నామ్ కే వాస్తే ఒక సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుంది అన్నట్టు ఈ సినిమాను తీసారేమో అనిపిస్తుంది. ఫస్ట్ 15, 20 నిమిషాలు చాలా అద్భుతంగా ఉంటుంది.

అదే టెంపో కానీ ఇంకొక గంట సేపు కొనసాగి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుండేది. కానీ పావుగంట తర్వాత టెంప్లేట్ ఫార్ములా కథకు వచ్చేసాడు సంపత్ నంది. సేమ్ ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టు శోభనం రోజు పెళ్లికూతురులను చంపే ప్రాసెస్ మొదలవుతుంది. ఫస్ట్ పార్ట్ లో మనిషి చంపితే సెకండ్ పార్ట్ లో దయ్యం వచ్చి చంపుతుంది అదొక్కటే తేడా. ఇంటర్వెల్ కు కానీ తమన్నా రాదు.. తమన్నా వచ్చిన తర్వాత కానీ కథ ముందుకు కదలదు. కదిలించడానికి అక్కడ కథ కూడా లేదు. ఒక దశలో దేవుడు కూడా దయ్యాన్ని ఎదిరించలేక వెనకడుగు వేస్తాడు. చివరికి క్లైమాక్స్లో హనుమాన్ సలహాలు కాసేపు శివుడిని చూపించి ప్రేక్షకులను కూల్ చేయడానికి ప్రయత్నించాడు సంపత్ నంది. కానీ సినిమా అంతా చావగొట్టి చెవులు మూసి చివర్లో దేవుడుని చూపించి దండం పెట్టమంటే ఎలా..? తీసేది రొటీన్ సినిమా అయినప్పుడు స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు సంపత్ నంది.

నటీనటుల విషయానికి వస్తే.. నిజం మాట్లాడుకుంటే తమన్నాకు ఈ గెటప్ పెద్దగా సూట్ కాలేదు. కానీ నాగ సాధువుగా నటించడానికి తనకు వీలైనంతవరకు ప్రయత్నించింది తమన్నా. వశిష్ట ఎన్ సింహ పాత్ర మీదే ఈ సినిమా అంతా పోతుంది. మనోడు నటన బాగుంది.. కాకపోతే డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు. హెబ్బా పటేల్ రెండు మూడు సన్నివేశాల్లో నటించింది. మురళీ శర్మ క్యారెక్టర్ అరుంధతిలో షయాజీ షిండేను గుర్తుచేస్తుంది. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే.. మంగళవారం సినిమాకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అజినీష్ లోకనాథ్ ఈ సినిమాకు కూడా మంచి సంగీతం అందించాడు. పాటలు పర్లేదు.. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సిందే. కానీ దర్శకుడు ఛాయిస్ కాబట్టి తప్పు పట్టలేము. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. దర్శకుడు అశోక్ తేజ కేవలం పేరుకు మాత్రమే.. అక్కడ చేసింది మొత్తం సంపత్ నంది. రొటీన్ కథ కోసం నిర్మాతలతో చాలా ఖర్చు పెట్టించాడు సంపత్. చివరగా చెప్పాలంటే ఈ ఓదెల 2ను ఆ శివయ్య కూడా కాపాడలేడేమో…